క్రిష్ణ హీరోగా నటించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రానికి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం వుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలు, ఈ సినిమా రూపొందించడానికి ప్రేరేపించిన అంశాలు చర్చించుకునే ముందు దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్పి తర్వాత వివరాల్లోకెళదాం.
ఒక పెద్ద మనిషి అహోరాత్రులు తపస్సు చేసి జ్నాన దేవతను ప్రత్యక్షం చేసుకున్నాడట. తన కోసం తపించిన మనిషికి ఏదైనా ఇవ్వాలనుకొోవడం ప్రక్రుతి ధర్మం. ఆ ధర్మం ప్రకారమే … నరుడా ఏమి నీ కోరిక అని అడిగిందట జ్నానదేవత. అమ్మా.. నువ్వు సకల సౌభాగ్యాల దేవతవు కదా. నీవు మేగ్జిమమ్ ఇవ్వగలిగినంత నాకివ్వు అన్నాడట భక్తుడు. బాబూ నేను ఇచ్చేదానిలో ఇదే అత్యధికమైనది, ఎక్కువైనది అని నిర్ణయించలేము కద. అందట ఆ దేవత. అదేంటి తల్లి అని భక్తుడు ఆశ్చర్యం ప్రకటించాడు. అవును నాయనా.. నా దగ్గర వున్నది, నాకు సమకూరుతున్నది ఇవ్వడమే నా ధర్మం. ఇప్పుడు నా దగ్గర వున్నది ఇవ్వగలను అందట. భక్తుడికి జ్నానోదయం అయ్యింది. మనం జ్నానాన్ని సమకూర్చుకుంటూ పోవచ్చు.. అంతే కానీ, అంతా ఒకేసారి కావాలంటే జ్నానదేవతే కన్ ప్యూజ్ అయ్యే ప్రమాదం వుంది. ఈ కథ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సినిమాలు బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ సినిమాల్లోకి మారుతున్న రోజుల్లో పూర్తిగా కలర్ చిత్రంగా మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని రూపొందించారు. ఇక్కడ పూర్తి కలర్ చిత్రం అని ఎందుకన్నారంటే అప్పట్లో కొద్ది భాగం మాత్రమే కలర్ లో చిత్రీకరించి మిగతా భాగాన్ని బ్లాక్ అండ్ వైట్ లో షూట్ చేసేవారు. తొలి కౌబాయ్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం కోసం హీరో క్రిష్ణ చాలా రిస్క్ చేశారని అందరూ చెప్పుకున్నారు. పైన చెప్పిన కథలో మాదిరి గా ఒకొక్క సాంకేతిక పరిజ్నానాన్ని తెలుగు తెరకు పరిచయం చేసింది సూపర్ స్టార్ క్రిష్ణనే.. తను తొలి సినిమాగా నిర్మించిన అగ్నిపరీక్ష… తర్వాత చిత్ర నిర్మాణానికి దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్నారు. తర్వాత ఎలాంటి సినిమా చేద్దాం అని ఆలోచిస్తున్న సమయంలో మద్రాసులో మెకన్నాస్ గోల్డ్, గుడ్ బ్యాడ్ అగ్లీ, అనే కౌబాయ్ చిత్రాలు విడుదలయ్యాయి. హాలీవుడ్ సినిమాలు చూసే అలవాటున్న క్రిష్ణ ఆ సినిమా చూశారు. వీటి స్పూర్తితో తెలుగు నేటివిటీకి తగ్గట్టు కౌబాయ్ కథతో సినిమా తీస్తే ఎలా వుంటుంది అనే ఆలోచన రాగానే తన సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరి రావులతో చర్చించి అడుగు ముందుకు వేశారు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విజయాధినేతల్లో ఒకరైన చక్రపాణి గారు, క్రిష్ణ తండ్రిగారు మంచి స్నేహితులు. ఆ కారణంతో క్రిష్ణ బాగోగులు ఆయన చూసేవారు. ఒక రోజు చక్రపాణి గారు షూటింగ్ చూడటానికి వచ్చారు. అక్కడ జరుగుతున్న షూటింగ్ చూసి పెదవి విరిచారు. ఆగెటప్ లేంటి…. ఇక్కడ గుర్రాల మీద వెళ్లి ఆవులు కాచుకునే సంస్క్రుతి లేదు. మనది కాని సినిమాను ప్రేక్షకులు ఆదరించరు. ఇది చాలా రిస్క్ తో కూడుకున్నది అని చెప్పారు. కానీ అప్పటికే సగభాగం పూర్తయిన సినిమాను ధైర్యంతో అలాగే ముందుకు తీసుకెళ్లడానికే క్రిష్ణ ప్రయత్నించారు. ఆయన ఎక్కడా నిరాశ చెందలేదు. ఆశావాదం, పట్టుదల రెండూ కలిస్తే నమ్మకం. ఆ నమ్మకంతోనే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని క్రిష్ణ ముందే ఊహించారు. తను పూర్తిగా కలర్ చిత్రంతో పాటు ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించాలి అనే ఉద్దేశ్యంతో థార్ ఎడారిలో షూటింగ్ చేశారు. ఉత్తరాదిన వున్న బికనీర్ కోట, శివబాడీ టెంపుల్, దేవీ కుంట సాగర్, సిమ్లా, కుఫ్రీ టిబెట్ కు సమీపంలో నార్కండా స్నోఫాల్ సట్లేజ్ నదీతీర ప్రాంతమైన తట్టా పానీ లొకేషన్లలో చిత్రీకరించారు. షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన చిత్ర యూనిట్ ను కలిచి వేసింది.సిమ్లాకు పది కిలో మీటర్ల దూరంలో కుఫ్రీ లోయ టిబెట్ కు దగ్గర్లో వున్న నార్కండా స్నో ఫాల్ లొకేషన్ లో క్రిష్ణ, విజయ నిర్మల మీద ‘ కోరినది నెరవేరినది ‘ అనే పాట చిత్రీకరణ జరుగుతోంది. కాళ్లకు బూట్లు లేకుండా మంచులో విజయ నిర్మల స్టెప్స్ వేయడంతో ఆమె కాళ్లు మొద్దుబారి రక్త ప్రసరణ లేక కాళ్లు నీలి రంగులోకి మారిపోయాయి. అయినా ధైర్యంగ సినిమాను పూర్తి చేసి తెలుగు చిత్ర పరిశ్రమ పుటల్లో లిఖించదగ్గ సినిమాగా తీర్చిదిద్దారు..ఇక కథ విషయానికి వస్తే…." ఒక వైపు చారిత్రాత్మక యుద్ధ సందర్భాల్నీ మరొక వైపు ఆ సమకాలిక వాతావరణాన్నీ స్పృశిస్తూ - కధాగమనంలో వచ్చే పాత్రలద్వారా ఆయా పరిస్థితుల్ని స్పందిస్తూ చిత్రకథను కే.ఎస్. ఆర్ దాస్ నడిపించారు. కథ విషయానికి వస్తే అవి బొబ్బిలి యుద్ధం జరిగిన క్రొత్త రోజులు, ఒక ప్రక్క యింగ్లీషువాళ్ళూ మరొక ప్రక్క ఫ్రెంచి వాళ్ళూ భారత దేశాన్ని కబళింపజూస్తున్నారు. చిన్నచిన్న సంస్థానాధిపతులూ, పాలె గాండ్రూ, నవాబులూ స్వాతంత్రం ప్రకటించు కుంటున్నారు. దేశంలో ఎక్కడ చూసినా తిరుగు దాట్లూ పితూరీలు యుద్ధాలు చెలరేగుతున్నాయి. పిండారీ, మరాఠీ బందిపోటు దండులు దేశాన్ని కొల్ల గొడుతున్నారు. ప్రజల ప్రాణాలకన్నా ప్రభుత్వ ఖజానాలకే రక్షణ ముఖ్య మను కొంటున్న రోజులవి ! ఆటు వంటి రోజుల్లో న్యాయానికి ప్రతినిధిగా, ధర్మానికి రక్షణగా ఒక యువకుడు నిలబడ్డాడు. ఆ యువకుడి వీరగాధే• మోసగాళ్ళకు మోసగాడు చిత్రం కథ. ఈ సినిమా పూర్తవగానే క్రిష్ణ సినిమా ప్రివ్యూను తన సన్నిహితులకు చూపించారు. సినిమా చూసిన వాళ్లందరూ పెదవి విరిచారు. కానీ సినిమా చూసిన ఎన్టీఆర్ మాత్రం ఈ చిత్రం తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని చెప్పారు. ఆయన వాక్కు ఫలించింది. 27-8-1971న విడుదలైన మోసగాళ్లకు మోసగాడు శతదినోత్సవం వైపు పరుగుతీసింది. చెన్నైలో శతదినోత్సవ వేడుక కూడా జరుపుకుంది.కృష్ణ, విజయనిర్మల, జ్యోతిలక్ష్మి. నాగభూషణం, సత్య నారాయణ, ప్రభాకర రెడ్డి, రామదాసు, సాక్షి రంగారావు, ధూళిపాళ, ఆనంద మోహన్ , కె. జగ్గారావు. త్యాగరాజు, కాకరాల, రావుగోపాల రావు. గోకిన రామారావు ముఖ్య పాత్రధారులు.గా గుమ్మడి, శాంత కుమారి, యస్. వర లక్ష్మి, రాజసులోచన గెస్ట్ పాత్రధారులుగా రూపొందిన మోసగాళ్లకు మోసగాడు చిత్రం భారీ తారాగణంతో 28 రోజుల్లో షూటింగ్ పూర్తిచేసుకున్నఈ భారీ చిత్రం ట్రెజర్ హంట్ పేరుతో ఆంగ్లం లోకి గన్ ఫైటర్ జానీ పేరుతో హిందీలోకి మోసక్కారన్కక్కు మోసకారన్ పేరుతో తమిళంలో అనువదించారు. ఈ సినిమా స్పూర్తితో తెలుగులో మరికొన్ని కౌబాయ్ చిత్రాలు వచ్చాయి కానీ ఏదీ విజయవంతం కాలేదు. దాంతో మోసగాళ్లకు మోసగాడు ఓ ప్రత్యేక చిత్రంగా నిలిచి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. గన్ ఫైటర్ జానీ కలకత్తా, తూర్పు పంజాబీ ప్రాంతాల్లో ఘనవిజయం సాధించింది. కోల్ కత్తాలో 20 ప్రింట్లు పంజాబ్ లో ఏడు ప్రింట్లు విడుదల చేశారు. ఈ చిత్రాన్ని అప్పట్లో ఇంగ్లీషులోకి అనువదించి విడుదల చేశారు. దాదాపు 14 వేల అడుగుల వున్న ఈ చిత్రాన్ని 9 వేల అడుగులకు కుదించి పాత్రకేయుడు రాండార్ గౌతో సబ్ టైటిల్స్ తయారు చేయించి ట్రెజర్ హంట్ పేరుతో విదేశాల్లోనూ విడుదల చేశారు. తెలుగు నుంచి ఇతర విదేశీ భాషలోకి అనువదించి విడుదల చేసిన తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. ఇందులో జిప్సి యువతి గా రాజసులోచన పాల్గొన్న నాట్యంలో పాట భాగాన్ని తొలగించి మ్యూజిక్ వున్న షాట్స్ మాత్రం ఉంచేశారు. ఈ పాత్ర ఎలాగూ జిప్సి యువతి . ఆమె పాట అర్థం కానవసరం లేదు. ఆ పాట సన్నివేశం జనానికి నచ్చింది. మొత్తం పాట షాట్స్ పంపండి. అని విదేశీ పంపిణీ దారుడు అడగడంతో ఆ బిట్లు కూడా పంపారు. ఆంగ్ల చిత్రాల స్పూర్తితో తయారైన మోసగాళ్లకు మోసగాడు మళ్లీ ఆంగ్లంలో అనువాదమై అక్కడి ప్రజల ఆదరణ పొందడం ఓ విశేషం.
Social Plugin