G-N7RFQXDVV7 పాత తరం నటుడు రమణా రెడ్డి చూసిన తొలి షూటింగ్ విశేషాలు

Ticker

6/recent/ticker-posts

పాత తరం నటుడు రమణా రెడ్డి చూసిన తొలి షూటింగ్ విశేషాలు




 తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పాత తరం నటుడు రమణారెడ్డి గురించి ఇప్పటి జనరేషన్ కు తెలీక పోవచ్చు. యూటూబ్ ఓపెన్ చేసి పాత సినిమాలను ఒక సారి చూస్తే సన్నగా, పొడవుగా ఇట్టే ఆకట్టుకునే నటుడే రమణా రెడ్డి. ఆయన అప్పట్లో తను చూసిన తొలి షూటింగ్ గురించి అపట్లో ఆయన చెప్పిన మాటలు యదాతథంగా మీ కోసంపద్ధెనిమిది సంవత్సరాల క్రితం అనుకుంటాను. అది ఎ. శంకరరెడ్డి గారి జానపద చిత్రం. వై. వి. రావు గారి దర్శకత్వంలో శ్రీమతి జి. వరలక్ష్మి, సి హెచ్. నారాయణరావు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆ రోజు వాళ్ళతో పాటు సినిమా రంగంలో ప్ర ప్రధమంగా అడుగు పెడుతున్న ఒక కొత్త నటుడు జంగందేవర వేషంలో నటిస్తున్న దృశ్యం చిత్రీకరిస్తున్నారు. జంగం దేవర  చాలా దుర్మార్గుడట. నుదుటి మీద పెద్ద నామం, మెడలో రుద్రాక్షలు అవీ బాగా తగిలించుకుని వస్తాడు. కథానాయిక అప్పుడు ఏదో ఒక సందర్భంగా అన్నదానం చేస్తూ వుంటుంది. ఆమెను ఆమె అందాన్నీ అలా చూస్తూండగానే ఆ జంగం దేవర బుర్రలో పురుగు ప్రవేశిస్తుంది. అంటే కథానాయికను ఎత్తుకు పోవాలని జంగందేవరకు దురాలోచన కలుగుతుందన్నమాట ఆ ఉద్దే శంతో ఆమెను అలా ఒక్క చూపు చూడాలి.  డైరక్టర్ గారు జంగం దేవరను చూస్తూ. కెమెరా ముందు నిలబెట్టి కథా నాయికను ఒక్క చూపు చూడనున్నారు. చుట్టూ లైట్లు జిగేలుమని మెరుస్తున్నాయి. జంగం దేవరకు కాళ్ళు వణుకుతున్నాయి. ఒళ్ళంతా చెమటలు పట్టింది. బిత్తర చూపులు చూస్తాడు గాని హీరోయిన్ వైపు చూడగానే..... మొదటి " టేక్" సరిగ్గా రాలేదు. రెండో 'టేక్'లో ఆకారాన్ని చూడసాగాడు. మూడో 'టేక్ 'లో నేల వైపు చూస్తున్నాడు. అలా పదిసార్లు ప్రయ త్నించినా 'షాట్' రాలేదు. డైరక్టర్ గారికి కోపం వచ్చింది. "ఏమిటయ్యా క్రిందా మీద చూడడానికి ఇదేమన్నా పిట్టల వేట, కోళ్ళు పట్టడం అనుకున్నావా....? ఒక్క సారి సరిగ్గా ఆమె వైపు చూడమంటే చూడవేం?" అన్నారు గదమాయిస్తూ. జంగం దేవరకు రోషం వచ్చింది. "తియ్యండి సార్.. షాట్" - అని గుర్రుగా చూశాడు డైరక్టర్ వేపు.. కెమెరా దగ్గరకు వచ్చింది. అల్లంత దూరంలో కథానాయిక కనబడుతోంది అంతే. ఒక్క చూపు చూశారు. షాట్  'ఓకే -అయింది. "నీకు మూడ్ తెప్పిద్దామని అలా -అన్నానోయ్. షాట్ బాగా వచ్చింది" అని డైరక్టర్ గారు నవ్వుతూ జంగందేవర భుజం తట్టారు అభినందన పూర్వకంగా, దేవర తల కాయ వంచుకొని కొద్దిగా సిగ్గుపడ్డాడు. అదండీ.... నేను చూసిన తొలి షూటింగ్. అన్నట్టు ఆ చిత్రం పేరు 'మానవతి'. ఇంతకీ ఆ జంగందేవర ఎవరని చెప్పలేదు కదూ..... అబ్బే మాట వచ్చింది కాబట్టి చెబుతున్నాను. అది నేనే అన్నారు రమణా రెడ్డి