G-N7RFQXDVV7 నాని హీరోగా నటించిన HIT 3 రియల్ రివ్యూ

Ticker

6/recent/ticker-posts

నాని హీరోగా నటించిన HIT 3 రియల్ రివ్యూ

 



హిట్ 3లో ఎమోషన్స్‌ కంటే సైకో కిల్లర్స్ ఏరివేతకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి నరమేధం సృష్టించాడు నాని.

  నేచురల్ స్టార్ నాని సొంత నిర్మాణంలో వచ్చిన ‘హిట్’ ఫ్రాంచైజీలోని గత చిత్రాలు ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఒక హత్య కేసును చాలా తెలివిగా ఛేదించగలిగే పోలీస్ ఆఫీసర్స్‌గా కనిపించారు హిట్, హిట్ 2 చిత్రాల్లోని అడవి శేష్, విశ్వక్ సేన్‌లు. అయితే హిట్ 3‌తో సొంత ఫ్రాంచైజీలో నిర్మాతగా కాకుండా ఈసారి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని.. ఈ మూడోకేసు మాత్రం గత చిత్రాల మాదిరిగా ఉండదని ముందు నుంచీ చెప్తూనే ఉన్నాడు. అన్నివర్గాల ప్రేక్షకుల్నీ ఆదరించే చిత్రాలు కొన్నైతే.. టార్గెట్ ఆడియన్స్‌ని మెప్పించే చిత్రాలు కొన్ని ఉంటాయి. హిట్ 3 టార్గెట్ ఆడియన్స్‌‌ని మెప్పించే చిత్రం అని ముందు నుంచీ చెప్పిన నాని.. ఆ మాటను తూచా తప్పకుండా పాటిస్తూ కేవలం తన టార్గెట్ ఆడియన్స్ కోసమే ఈ మూడో కేసుని హింసాత్మకంగా ఛేదించాడు.

CTK (క్యాప్చర్ టార్చర్ కిల్లింగ్) అనే సైకో కిల్లర్స్ గ్యాంగ్‌ని అంతమొందించడానికి ఎస్పీ అర్జున్ సర్కార్ (నాని -Nani) సృష్టించిన మారణహోమమే హిట్ 3. హిట్ టీంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయిన అర్జున్ సర్కార్.. అతి కిరాతకంగా రెండు సీరియల్ మర్డర్స్ చేస్తాడు. ఆ రెండు మర్డర్స్ కూడా ఒకే తరహాలో ఒకే విధంగా చేసి.. దాన్ని రికార్డ్ చేసి.. డార్క్ వెబ్ సైట్‌లో అప్ లోడ్ చేస్తాడు. ఏక కాలంటో దేశ వ్యాప్తంగా ఇలాంటి సీరియల్ సైకో మర్డర్స్ చాలానే జరుగుతుంటాయి. ఆ హత్యలకి అర్జున్ సర్కార్‌కి లింకేంటి? అసలు ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఆ కేసుని అర్జున్ సర్కార్ ఏవిధంగా ఛేదించాడు? అతను అంత క్రూరంగా మారడానికి కారణం ఏంటనేదే ‘హిట్ 3’ అసలు కథ.

అన్యాయంపై హీరో తిరుగుబాటు.. వృత్తిపరమైన ఆధిపత్యం.. ప్రతి రివేంజ్ కథలోని కామన్‌ పాయింటే. కానీ అదే కథలో ఊహాతీతమైన ట్రిగ్గర్ పాయింట్ ఉంటే.. బలమైన సన్నివేషాలు.. పదునైన సంభాషణలతో పరుగులు పెట్టే కథనం తోడైతే ఆ కథకి తిరుగు ఉండదు. దర్శకుడు శైలేష్ కొలను హిట్ ఫ్రాంచైజీలో గత రెండు చిత్రాలను ఇదే తరహాలో రూపొందించి.. హిట్ 3కి మోస్ట్ వయొలెన్స్‌ని అనే డిఫరెంట్ ట్రీట్‌మెంట్ జోడించారు. ‘ఆపదలో ఉన్న వాళ్లను రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు’ అంటూ చాగంటితో ప్రవచనాలు చెప్పిస్తూ.. హీరోతో ఊచకోత కోయించాడు.

అర్జున్ సర్కార్ చేసిన నేరంతో కథ మొదలౌతుంది. అది నేరమా? లేదంటే నేరం చేసిన వాళ్లకి విధించే శిక్షా? అన్న కథాగమనంలో ట్విస్ట్‌లు.. ట్రిగ్గర్ పాయింట్‌లు చాలానే ఉన్నాయి. అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నానిలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు దర్శకుడు. పగ, ప్రతీకారం కథకి రిలేటబుల్‌గా డీల్ చేస్తూ.. కేసుకి సంబంధించిన ఇంటెన్సిటీ‌.. ఎంజాయ్ చేసే విధంగానే ఉంటుంది. కానీ.. ఎంత సైకో గ్యాంగ్‌ని అంతం చేయడానికి హీరో కూడా సైకోలని మించిన సైకోగా మారాలనే పాయింట్ ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎలివేషన్స్ కోసం హింసను ప్రేరేపించే సినిమాలకంటే.. కథే హింసను కోరుకునే సినిమాలనే జనం ఆదరిస్తుంటారు. హిట్ 3 ఈ రెండింటికి మధ్యలోనే ఆగిపోయింది. అర్జున్ సర్కార్ ఎందుకంత క్రూరమైన వ్యక్తిగా మారాడు అనేదానికి బలమైన కోర్ ఎమోషన్ కనిపించదు.

చిన్నపిల్లలు.. సున్నిత మనస్కులు ఈ సినిమాకి దూరంగా ఉండమని ముందే చెప్పిన నాని.. ఈ సినిమాలో కేవలం చిన్నపిల్లలు.. సున్నిత మనస్కులనే కాదు.. కామన్ ఆడియన్స్‌‌ని చాలాసార్లు కళ్లు మూసుకునేట్టు చేశాడు. అంత దారుణంగా రక్తపాతం సృష్టించేశాడు. హీరో దేని కోసం ఈ మారణహోమం చేస్తున్నాడనే పాయింట్‌ని ఫస్టాఫ్ ముంగిపు వరకూ రివీల్ చేయలేదు. ఇక సెకండాఫ్‌లో అసలు కథ ఉంటుందని బోలెడన్ని ఆశలతో ఉంటే.. దీనికోసమేనా ఇంత మారణహోమం అనేట్టుగా సింపుల్‌గా తేల్చేశారు. 150 మంది సైకో కిల్లర్స్‌ని ఊచకోత కోయడం.. వాళ్లు తిరిగి నరికినా.. చంపినా లేచి వచ్చేయడం.. శరీరాన్ని తూట్లు తూట్లుగా పొడిచినా హీరో విజృంభించి తనకేదో ఊహీతీతమైన శక్తులు ఉన్నట్టుగా ఫైట్లు చేసేయడం లాంటివి వాస్తవానికి దూరంగా అనిపిస్తాయి.

ఊపిరిసలపని వయెలెన్స్‌లో రిలీఫ్ అంటే.. హీరో నాని క్యారెక్టరైజేషన్. అర్జున్ సర్కార్‌గా నిజంగానే సర్కార్ అనేట్టుగా నటించాడు. జెర్సీ, దసరా, హాయ్ నాన్న, హిట్ 3 ఇలా సినిమా సినిమాకి డిఫరెంట్ కథల్ని ఎంచుకుంటూ.. కథకి తగ్గ కథానాయకుడిగా మారిపోతున్నారు నేచురల్ స్టార్ నాని. ఇష్టం లేకపోతే కష్టం కానీ.. పాత్రని ఆస్వాదిస్తే పనిచేస్తే తిరుగుఉండదనే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న నాని అర్జున్ సర్కార్ పాత్ర కోసం ప్రాణం పెట్టేశాడు. ఏయ్.. అని అతను అరిచే అరుపు నిజంగానే భయపెట్టింది. నెంబర్ గేమ్స్‌కి కాస్త దూరంగా ఉన్నా స్టార్ హీరోలతో ధీటుగా సినిమాలు చేస్తున్న నాని.. ఎప్పుడో స్టార్ హీరో అనిపించుకున్నారు. అయితే మన టాలీవుడ్ బడా స్టార్‌లంతా స్టార్ డైరెక్టర్స్‌తో సేఫ్‌గా నెంబర్ గేమ్ ఆడుతుంటే నాని మాత్రం థింక్ డిఫరెంట్ అన్నట్టుగా యంగ్ డైరెక్టర్స్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తలపడుతున్నాడు. ఇది గొప్ప విషయం.. గట్స్ ఉన్న విషయం.

అర్జున్ సర్కార్‌గా తనలోని మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్‌కి గట్టిగానే పదునుపెట్టాడు నాని. దెం** .. దెం **.. అంటూ నాని చాలాసార్లు బూతుల్ని మింగేసినా.. ఆ సౌండ్ మాత్రం థియేటర్స్‌లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అర్జున్ సర్కార్‌గా తన క్యారెక్టర్‌‌కి లిమిటేషన్ ఉండవు అనేట్టుగానే జీవించేశాడు నాని.

హీరోయిన్‌తో సహా.. కథలో కనిపించే ప్రతి పాత్రకి ప్రత్యేకించిన పర్పస్ ఉంటుంది. స్క్రీన్‌పై అలంకార ప్రాయమైన పాత్రల్ని కాకుండా.. కథని అవసరం అయ్యే పాత్రలతో ఇంపార్టెన్స్ కల్పించారు. కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. ఇంపార్టెన్స్ రోల్ ప్లే చేసింది. ఆమెది నెగిటివ్ రోల్ అదీ ఇదీ అంటూ ఊదరకొట్టారు కానీ.. పోలీస్ ఆఫీసర్‌గా కీ రోల్ పోషించింది. యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ భాగం అయ్యింది.

నాని-శ్రీనిధిల మధ్య లవ్ అండ్ ఎమోషన్స్ సీన్స్ బాగా పండాయి. ‘అమ్మ దగ్గర పెరగలేదు కదా.. నీకు ఓకే అయితే అమ్మ ప్రేమ నేర్పిస్తాను’ అంటూ హీరోయిన్ ప్రపోజ్ హార్ట్ టచ్చింగ్‌గా ఉంటుంది. ట్రైన్‌లో వీళ్లిద్దర్నీ కలిపే లిప్ లాక్ సీన్‌కి యూత్ బాగా కనెక్ట్ అవుతుంది. హిట్ 2 హీరో అడవి శేష్.. ఎంట్రీ సర్ ప్రైజ్‌గా అనిపిస్తుంది కానీ.. కథలో పెద్దగా ప్రాధాన్యత లేదు. క్లైమాక్స్‌లో వచ్చి విలన్ల ఏరివేత కార్యక్రమంలో భాగం అయ్యాడంతే. ఇక హిట్ సీక్వెన్స్‌లో నాలుగో కేసు ఉండబోతుందని ఏసీపీ వీరప్పన్‌గా కార్తిని చూపించారు. ఈ హిట్ 3కి కార్తీకి ఎలాంటి సంబంధం లేదు. జస్ట్ కామియో రోల్‌‌కి మాత్రమే పరిమితం అయ్యారు కార్తి. పోలీస్ అధికారులుగా.. రావు రమేష్, చైతన్య జొన్నలగడ్డ ఇంపార్టెన్స్ రోల్స్‌లో కనిపించారు.

షాన్ వర్గీస్.. సినిమాటోగ్రాఫర్ విజువల్స్‌‌ గ్రాండ్‌గా ఉండటమే కాదు.. తన విజువలైజేషన్‌తో కథ చెప్పే విధంగా సన్నివేషాలను చిత్రీకరించారు. మిక్కీ జె మేయర్ తొలిసారిగా క్రైమ్ థ్రిల్లర్‌ చిత్రానికి సంగీతం అందించడం ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. ఇప్పటివరకూ ఫీల్ గుడ్ మూవీస్‌కి మ్యూజిక్ అందించిన మిక్కీ జె మేయర్.. థ్రిల్లర్ కథకి అందించిన సౌండ్ కొత్తగా అనిపిస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ అక్కడక్కడా అలరించింది.. ఇంకొన్ని చోట్ల భయపెట్టింది. ముఖ్యంగా నాని క్యారెక్టరైజేషన్‌ని మిక్కీ జె మేయర్ ఆర్ ఆర్‌తో బాగా ఎలివేట్ చేశారు. చివరి 30 నిమిషాలు వాయించిపారేశారు.

ఓవరాల్‌గా.. ‘హిట్ 3’ మూడో కేసు గత రెండు కేసుల్నిమించి అయితే లేదు. నాని కోసం అయితే ఓసారి చూడొచ్చు. బట్.. హింసని తట్టుకునేవాళ్లకి మాత్రమే. చిన్న పిల్లల్ని మాత్రం ఈ ‘హింస’కి దూరంగా ఉంచడం మంచిది.